ENGLISH | TELUGU  

దాసరి, రాఘవేంద్రరావు కాంబినేషన్స్‌లో 52 సినిమాలు చేసి రికార్డు క్రియేట్‌ చేసిన జయసుధ!

on Dec 17, 2025

(డిసెంబర్‌ 17 సహజనటి జయసుధ పుట్టినరోజు సందర్భంగా..)

ఒక సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఎంత ప్రధానమో.. హీరోయిన్‌ క్యారెక్టర్‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. పాతరోజుల్లో వచ్చిన సినిమాల్లో హీరోయిన్లు తమ నటనను ప్రదర్శించే విధంగా వారి కారెక్టర్లను డిజైన్‌ చేసేవారు. పాతతరం హీరోయిన్లు ఎంతో మంది ఆ తరహా పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆరోజుల్లో సావిత్రి, జమున, వాణిశ్రీ వంటి కథానాయికలు పోషించిన తరహా పాత్రలతో ఆ తర్వాతి తరంలో మంచి పేరు తెచ్చుకున్న నటి జయసుధ. అందరూ మాట్లాడుకునే స్థాయిలో ఆమె నటన ఉండేది. 1970వ దశకంలో నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన జయసుధ చాలా తక్కువ సమయంలో వరస అవకాశాలు అందిపుచ్చుకొని నటిగా బిజీ అయిపోయారు. 

 

ఎలాంటి పాత్రనైనా తన సహజ నటనతో రక్తి కట్టించగల సమర్థత ఉన్న జయసుధ.. ఒక దశలో హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌కి వెళ్ళిపోయారు. ఆమె నటించిన 25 సినిమాలు ఒకే సంవత్సరం విడుదలయ్యాయి అంటే అప్పటికి ఆమె ఎంత బిజీ హీరోయినో అర్థం చేసుకోవచ్చు. నటిగా అంతటి ఉన్నత స్థానాన్ని పొందిన జయసుధ సినిమా కెరీర్‌ ఎలా ప్రారంభమైంది, ఆమె సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి అనే విశేషాల గురించి తెలుసుకుందాం.

జయసుధ అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్‌ 17న మద్రాస్‌లో జన్మించారు. ఆమెకు ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మేనత్త అవుతారు. సుజాతకు ఊహ తెలిసే సమయానికే విజయనిర్మల రంగుల రాట్నం, పూలరంగడు, సాక్షి వంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. విజయనిర్మలకు సుజాత అంటే ఎంతో ప్రేమ.. అందుకే షూటింగ్స్‌కి ఆమెను వెంట బెట్టుకొని వెళ్లేవారు. సినిమాల షూటింగ్స్‌ ఎలా ఉంటాయి, నటీనటులు కెమెరా ముందు ఎలా పెర్‌ఫార్మ్‌ చేస్తారు అనే విషయాలు చూస్తూ ఉండడం వల్ల సుజాతకు నటన పట్ల ఆసక్తి కలిగింది. తను కూడా  మేనత్తలా సినిమాలు చేసి పేరు తెచ్చుకోవాలి అనుకున్నారు. 

 

అదే సమయంలో సూపర్‌స్టార్‌ కృష్ణను విజయనిర్మల పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తమ సొంత బేనర్‌లో పండంటి కాపురం చిత్రం నిర్మించేందుకు విజయనిర్మల సన్నాహాలు చేసుకున్నారు. లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో 12 ఏళ్ళ బాలిక కావాల్సి వచ్చింది. ఆ పాత్రను సుజాతతో చేయించాలనుకున్నారు విజయనిర్మల. అయితే దానికి ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఆయన్ని కన్విన్స్‌ చేసి ఆ సినిమాలో నటించేలా చేశారు. కృష్ణ అన్నయ్య కుమార్తెగా పండంటి కాపురం చిత్రంలో నటించారు సుజాత. 1972 ఫిబ్రవరిలో మొదటిసారి సుజాత కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమా అదే సంవత్సరం జూలైలో విడుదలైంది. 

 

1972 నుంచే సుజాతకు సినిమా అవకాశాలు వరసగా రావడం మొదలైంది. తెలుగు, తమిళ సినిమాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. కె.బాలచందర్‌, ఆర్‌.త్యాగరాజన్‌ వంటి దర్శకులు  సుజాతకు మంచి అవకాశాలు ఇచ్చారు. అలా ఓ డజను సినిమాలు చేశారు. అప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో సుజాత పేరుతో అగ్రనటి ఉండడంతో సుజాత పేరును జయసుధగా మార్చారు ఓ రచయిత. 

 

చదువును అశ్రద్ధ చేస్తూ సినిమాల్లో నటించడం జయసుధ తండ్రికి ఇష్టం లేకపోయినా సినిమాలపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. 1975లో డైరెక్టర్‌ ఎన్‌.గోపాలకృష్ణ లక్ష్మణరేఖ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమాలోని కవిత పాత్రకు జయసుధ సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రారంభమై కొన్నాళ్ళు బాగానే షూటింగ్‌ నడిచినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. అదే సమయంలో కె.బాలచందర్‌ అపూర్వ రాగంగళ్‌ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే సోగ్గాడు చిత్రంలో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు కె.బాపయ్య. అలా జయసుధ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా పూర్తి కాకముందే రెండు మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అవి ఘనవిజయం సాధించడంతో హీరోయిన్‌గా జయసుధ బిజీ అయిపోయారు. లక్ష్మణరేఖ చిత్రాన్ని పూర్తి చేసేందుకు డేట్స్‌ ఎడ్జస్ట్‌ చెయ్యడం కష్టం అయిపోయింది. ప్రతిరోజూ రాత్రిళ్ళు షూటింగ్‌లో పాల్గొని ఆ సినిమాను పూర్తి చేశారు జయసుధ. 1975లోనే విడుదలైన ఆ సినిమా ఘనవిజయం సాధించి జయసుధకు మంచి పేరు తెచ్చింది. 

 

1976లో కె.రాఘవేంద్రరావు రెండో సినిమా జ్యోతి చిత్రంలో హీరోయిన్‌గా నటించారు జయసుధ. కె.రాఘవేంద్రరావు, జయసుధ కెరీర్‌లో గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా జ్యోతి. ఇక అక్కడి నుంచి ఆమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 1977 ఎన్టీఆర్‌, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన మొదటి సినిమా అడవిరాముడులో జయసుధకు ఓ మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో జయసుధకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. 

 

1980లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా ప్రేమాభిషేకం చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు దాసరి నారాయణరావు. ఆ సినిమాలోని వేశ్య పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో జయసుధ అయితే కరెక్ట్‌గా సరిపోతుందని భావించి ఆమెకు విషయం చెప్పారు దాసరి. వేశ్య పాత్ర కావడంతో చేయడానికి సంకోచించారు జయసుధ. నిడివి తక్కువే అయినా చాలా మంచి పేరు వస్తుందని దాసరి చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు. సినిమాలోని ఆమె పోర్షన్‌ను 10 రోజుల్లోనే పూర్తి చేసేశారు దాసరి. 1981లో విడుదలైన ప్రేమాభిషేకం సంచలన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. దాసరి చెప్పినట్టుగానే శ్రీదేవి కంటే జయసుధకే ఎక్కువ పేరు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా నటిస్తూనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు జయసుధ. 

 

త్రిశూలం, గృహప్రవేశం, మేఘసందేశం, అనురాగదేవత, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, కలికాలం వంటి సినిమాలు జయసుధకు సహజనటి అని పేరు తెచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే. ఆ తర్వాత హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అక్క, వదిన, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. 5 దశాబ్దాలుగా వివిధ పాత్రలు పోషిస్తూ నటిగా కొనసాగుతున్న జయసుధ తన కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కిపైగా సినిమాల్లో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాల్లో నటించారు. అంతేకాదు, భర్త నితిన్‌ కపూర్‌తో కలిసి జె.ఎస్‌.కె. కంబైన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో వైవిధ్యమైన సినిమాలను నిర్మించారు. 

 

తన సహజ నటనకుగాను ఉత్తమనటిగా 5 నంది అవార్డులు, ఉత్తమ సహాయనటిగా 4 నందులు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా 3, ఉత్తమ సహాయనటిగా 2 ఫిలింఫేర్‌ అవార్డులు, ప్రేమాభిషేకం చిత్రంలోని క్యారెక్టర్‌కు ఫిలింఫేర్‌ సెషల్‌ జ్యూరీ అవార్డు, ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డులు లభించాయి. ఇవికాక కళాసాగర్‌ అవార్డు, ఎఎన్నార్‌ నేషనల్‌ అవార్డు వంటి ఎన్నో అత్యున్నత అవార్డులు అందుకున్నారు జయసుధ. 

 

జయసుధ వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1982లో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే మనస్పర్థలు రావడంతో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. 1985లో బాలీవుడ్‌ హీరో జితేంద్ర బంధువైన నితిన్‌ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నిహాన్‌, శ్రేయాన్‌. జయసుధకు సేవాగుణం, దానగుణం ఎక్కువ. అందుకే ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ చేరి 2009లో కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత వైసీపీలో చేరారు. గత ఏడాది బీజేపీలో చేరి అందులోనే కొనసాగుతున్నారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.